Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page

ఒకఅవ్వ - ఒకబిడ్డ

ఒక అవ్వ ఉన్నది. ఆమె ఒకచోట కాళ్లు జాచుకొని కదలక మెదలక ఉండే మనిషి కాదు, ఊరూరు తిరిగే మనిషి. ఆమె చూడని గ్రామం, తొక్కని గుమ్మమూ లేదు. ద్రావిడ దేశమంతా కలయతిరిగింది. అంత ఉత్సాహవంతురాలన్నమాట.

ఒక పిల్లవాడున్నాడు- అతడు బొద్దుగా, ఏనుగు గున్నలాగా ఉంటాడు. ఈ బిడ్డ ఉన్న చోటునుంచీ కదలడు. ఉరకలతో పరుగులతో అరక్షణం కూడా ఊరక ఉండకపోవడం బిడ్డల గుణం. ఈ శిశువు అలాంటి శిశువుకాదు. విపరీతమైన శిశువు. ఈ పాపడు ఉన్న చోటునుండి కదలడు.

విపరీతమైన అవ్వ. విచిత్రమైన శిశువు. బిడ్డవలె అవ్వ ఉన్నచోట ఉండక ఊరూరు తిరుగుతుంది. అవ్వవలె బిడ్డ - కదలక మెదలక గుండ్రాయి లాగా కూర్చొని ఉంటాడు.

మరో విశేషం. ఇంత వయసైనా, ఇట్లు ఈ అవ్వ తిరగటానికి కారణం ఈ శిశువే! పల్లె, పట్టణం, జనపదం, గ్రామం, నగరం, ఒక్క చోటు ఏమి సర్వవ్యాపిలాగా తిరిగేటట్లు ఈమెను చేసిన ఘనుడు ఈ పాపడే.



ఈ శిశు వెవరు?

ద్రావిడభాషలో పిళ్ళై అంటే బిడ్డ పిళ్ళైకు శ్రేష్ఠవాచకమైన 'యార్‌' అనే పదం చేర్చితే- 'పిళ్ళైయార్‌' అనే పదం సిద్ధిస్తుంది. మర్యాదగా ఆ శిశువును పిళ్ళైయార్‌ అని ద్రావిడ దేశంలో వ్యవహరిస్తారు. ఆయన కూరుచున్న చోటునుండి కదలడు. ఎవరన్నా ఉలకక పలుకక కూరుచుని ఉంటే- అరవభాషలో 'నీవేమి కల్లు పిళ్ళైయారివా?' అనేది వాడుక. 'రాతి విగ్రహంలాగా కూర్చున్నావేమి?' అని అర్థం.

పార్వతీ పరమేశ్వరులకు ఈయన జ్యేష్ఠ పుత్రుడు పిళ్ళైయార్‌ అంటే వేరేకాదు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతి - అని వైదిక మంత్రములో చెప్పబడిన గణపతియే.

ఈయన ఈశ్వర భూతగణములకు పతి- గణానాం పతిః ఈయనను మించిన నాయకుడు వేరేలేనందున వినాయకుడని మరొకపేరు. ఒకపదంలో - వి - అనే విశేషణం చేరిస్తే అర్థం అతిశయ మౌతుంది. కొన్నిచోట్ల విరుద్ధార్థక మవటమూ కద్దు. ఈయన చేయనిపని అంటూ ఉండదు. ''మొక్కువారల పనుల్‌ చక్క జేసేడు సామి, గఱిక పూజల మెచ్చు గబ్బి వేల్పు'' పనులను చెఱచేవాడు, చక్కబెట్టేవాడూ ఈయనే. 'యం నత్వా కృతకృత్వాః స్యుః తం నమామి గజాననం' అన్ని కార్యములనూ ఆరంభించేటపుడు, అగ్రపూజ అందుకొనే పెద్దమనిషి ఈయనే.

ఈయనకు ఏనుగు ముఖము. ఏనుగుకు దేహబల మధికము. ఏనుగుకు ఇంత జవసత్త్వములున్ననూ, పులి సింహము మొదలైన జంతువులవలె ప్రాణిహింసచేయదు. బర్మా మలయా మొదలైన దేశాలలో బరువైన పనులకు ఏనుగులను విస్తారంగా పూర్వం నియోగించేవారు. పిళ్ళారి కూడా శక్తిమంతుడు. శక్తి ఉన్నది కదా అని మనకు అపకారం చేయడు. ఉపకార ప్రాణి. ఏనుగుకు బుద్ధి సూక్ష్మం. జ్ఞాపకశక్తి అధికం. గణపతి అనగా జ్ఞాన స్వరూపమే, నిర్మల నిర్వికల్ప గుణాతీత సాంద్రానంద పరబ్రహ్మ స్వరూపమే!

ఏనుగు ఏదిచేసినా అందంగా ఉంటుంది. అది ఊగులాడుతూ నడుస్తూంటే, ఆ ఠీవి, అహోయలు- అది గజ గమనమే మరి ఆ తొండమును విసరటం, చెవులను హఠాత్తుగా రెపరెప లాడించటం- తినడానికి ఎవరైనా ఏదైనా ఇస్తే ఆమాంతంగాలాక్కొని- గుటకాయస్వాహా- చేయటం- ఎంత చూచినా తృప్తి ఉండదు. దాని ముఖంలో శాంతి వెల్లివిరుస్తూ వుంటుంది. ఏనుగు వస్తేచాలు- పిల్లలు దానిచుట్టూ చేరుతారు. మృగజాతిలో అంత దర్శనీయమైన మృగం వేరొకటి ఉండదు.

మనుష్యులలో బిడ్డ లంటే ఒక విశేషం- పసిపిల్లల సాహచర్యంలో మనం ఎంత కాలమున్నా తనివితీరదు. నిష్కల్మషమైన మనస్సు. బోసి నవ్వులు, తొక్కు పలుకులు, క్రేళ్లురుకులు - ఎప్పుడూ ఆనందం ఇవీ శిశులక్షణాలు. ఇట్లా ఉండే బిడ్డలను చూస్తే ఎవరికి ఆనందం కలుగదు?

పిళ్ళారి ఏనుగకు ఏనుగు, బిడ్డకు బిడ్డ. అందుచేత ఆయనను ఎంతసేపు చూచినా తనివితీరదు. తుండము, నేకదంతమును తోరపుబొజ్జయు వామహస్తమున్‌- ఇట్లావుంటుంది. వెనకయ్యవేషం. శిశువువలె సారశ్యం, ఏనుగుగున్న బలం, దానివల్లనే చురుకుదనం. సుందరమైన పరమ మంగళస్వరూపం. జ్ఞానం, ఆనందం, శాంతి - ఒక్కచోట మూర్తీభవిస్తే ఆ రూపమే వినాయకుడు.

ఎన్నో పరస్పర విరుద్ధములైన విషయములు ఒక్కచోట సామరస్యంగా ఉన్నట్లు, ఈయనవద్ద ఉంటవి. ముఖం మృగ వర్గానికి చెందింది. దేహం మానవవర్గానికి చెందింది. రూపమేమో శిశువు. వాస్తవానికి ఆయన మృగమూకాదు; మనిషీ కాదు. ఆయనది దేవవర్గం. ఒకచేతిలో విరిగిన దంతం. మరొక్కచేతిలో మధురానుమధురమైన మోదకం. పూర్ణమైన వస్తువు- అపూర్ణదంతం చేతిలో ఉన్నవానికి పూర్ణత్వం మెక్కడ? కాని 'పూర్ణమదః పూర్ణ మిదం పూర్ణాత్‌ పూర్ణం' అన్న పరబ్రహ్మమే వినాయకుడు. ఈ విషయం మనకు ఎంతో మోదకరంగా లేదూ?

పిళ్ళారి బ్రహ్మచారి. కాని ఈ బ్రహ్మచారి అందరికీ పెళ్ళిచేసి పెట్టుతుంటాడు. ఏనుగు రూపంలోవచ్చి, వల్లి అనే అటవికకన్యను, సుబ్రహ్మణ్యశ్వరునికి జతచేసి పెట్టింది. ఈ మహానుభావుడే! ఈ కాలంలోనూ పెళ్ళికాని పిల్లలు, తమకు మంచివరుణ్ణి వెదకిపెట్టమని ఈయనను ప్రార్థిస్తూ వుంటారు. మరి ఆయనేమో, 'మొక్కువారల పనుల్‌ చక్కజేసెడు సామి' అన్న బిరుదు వహించినవాడు కదా! మొదటనే మోక్షం అంటే వీళ్ళకు కాబట్టదు - వీళ్ళ ఆశలను తీర్చి తర్వాత వీళ్ళను మోక్షకాములుగా చేద్దామని ఈయన ఉద్దేశ##మేమో!

తానేమో ఉన్న చోటునుండి కదలడు. భక్తులను అనుకొంటే ఆకాశం వఱకు అమాంతంగా ఎత్తి వేయగల దేవర ఈయన. దక్షిణదేశంలోని పరమభక్తురాలైన అవ్వైయార్‌ను ఆ విధంగా కైలాసం చేర్చిన ఘనత వీరికి ఉన్నట్లు ద్రావిడదేశంలో ఒక కథ వున్నది. ఇంకా మనకు తెలియని తత్త్వములు ఈయనవద్ద ఎన్ని ఉన్నవో?

స్వామిని ఈ విధంగా, శిశువుగా భావిస్తూ వుంటే మనకు రోమహర్హణంగా లేదూ? ద్రావిడదేశంలో ఏమూలచూచినా తణపతియే. ఆయన అనుగ్రహించిన అవ్వ అవ్వైయార్‌ దేశమంతా తిరిగి తత్త్వబోధ చేసింది. ఈయన ఉన్న చోటు నుండి కదలలేదు. ఆమె ఒక్కచోట నిలువక, ఊరూరూ తిరిగింది.

ఆ అవ్వ అవ్వైయార్‌. ఆ బిడ్డ పిళ్ళైయార్‌ !


Jagathguru Bhodalu Vol-10        Chapters        Last Page